NewsTelangana

తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ పిలుపు

Share with

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. మరో ఏడాదిన్నరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించితీరాలన్న కసిలో ఉన్న కమలం పార్టీ అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ ముఖ్యులను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా… సీనియర్ నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్థానిక నేతల సమావేశమని పార్టీ నేతలు చెబుతున్నారు. సంజయ్‌తో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వీరంతా… పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు… తెలంగాణలో పార్టీ వ్యూహాలపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ ముఖ్యనేత, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లడం… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించడం… ఇదే సమయంలో బీజేపీ నేతలకు ఢిల్లీ కబురు రావడం… మొత్తం పరిణామాలన్నీ కూడా తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీ ఫోకస్ పెట్టినట్టు అవగతమవుతోంది.