తెలంగాణ కాంగ్రెస్కు షాక్..సీనియర్ లీడర్ రాజీనామా…
తెలంగాణ కాంగ్రెస్కు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అసహనంతో ఉన్నారు ఆయన. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల పొన్నాల రాజీనామా చేయడం కాంగ్రెస్కు గట్టి దెబ్బే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నేరుగా రాజీనామా లేఖను పంపారు ఆయన. దీనితో రాష్ట్ర నాయకత్వంపై ఆయనకు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జనగామ టికెట్ ఆశిస్తున్న పొన్నాలకు టికెట్ లభించదేమోననే అనుమానం వెంటాడింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఈ జనగామ టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో ఆయన అసహనానికి గురయ్యారు. రాజీనామా అనంతరం ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 45 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, అవమానాలు, అవహేళనలు, ఇతరులను కించపరిచే మాటలు విని విసుగెత్తిందని వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రక్షాళన కోసం ఎన్నో సార్లు వినతులు చేశానన్నారు. కాగా ఈయన బీఆర్ఎస్లోకి చేరనున్నట్లు సమాచారం.