HealthHome Page SliderInternational

శిశువులకు కంగారూ సంరక్షణ ఎంతో అవసరం

Share with

పుట్టిన తొలిరోజులలో శిశువుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. బిడ్డను తల్లి దగ్గరే పెట్టుకోవడం, గట్టిగా హత్తుకోవడం వంటి చర్యల ద్వారా వారిని భద్రంగా చూసుకోవచ్చు. అచ్చం కంగారూ జంతువు తన బిడ్డను కడుపులోని సంచీలో పెట్టుకున్నట్లే. దీనినే కంగారూ సంరక్షణ అంటారు.

 9 నెలల పాటు గర్భంలో వెచ్చగా ఉన్నశిశువు బయటకు వచ్చాక బయటి పరిస్థితులకు అలవాటు పడడం, కుదురుకోవడం అంత తేలిక కాదు. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకైతే ఇంకా కష్టం. ప్రపంచంలో ఐదేళ్ల లోపు మరణిస్తున్న పిల్లలలో దాదాపు 40 శాతానికి పైన మొదటి నెలలోనే మరణిస్తున్నారు. వీరిలో 35 శాతం పైన నెలలు నిండకుండా పుట్టినవారే. ఇలాంటి పిల్లలకు తల్లి సహజ వెచ్చదనాన్ని, భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లి కడుపులో ఎదిగేటప్పుడు బిడ్డకు చర్మం కింద కొవ్వు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల చర్మం మందంగా మారుతుంది. కానీ తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలలో ఈ రక్షణ ఉండదు. వారి శరీర ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల వారు శ్వాస సరిగ్గా తీసుకోవలేకపోవడం, రక్తహీనత వంటి సమస్యలు ఏర్పడవచ్చు. వీటివల్ల ప్రాణాపాయం సంభవిస్తుంది. అందుకే వారిని వెచ్చగా, తల్లి గుండెల వద్దే ఉంచుకోవాలి. ఇలాంటి శిశువులను ఇంక్యుబేటర్లలో ఉంచిన దానికన్నా, తల్ల వద్ద ఉంచితేనే ఆప్యాయత, భద్రత లభిస్తాయని పరిశోధనలు పేర్కొన్నాయి. తల్లి ఛాతీపై బిడ్డను బోర్లా పడుకోపెట్టి ఇద్దరినీ కలుపుతూ మెత్తని వస్త్రంతో చుట్టి కూర్చోపెట్టాలి. బిడ్డ 2.5 కిలోల బరువు కంటే తక్కువగా ఉంటే ఈ పద్దతి ఎంతో మేలు చేస్తుంది. రెండు గంటలకొకసారి తల్లిపాలు పట్టడమూ అవసరమే. అందుకే బిడ్డను ఐసీయూలో ఉంచాల్సి వచ్చినా సరే తల్లి పక్కనే ఉంచాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ గట్టిగా సిఫారసు చేస్తోంది. ఇలాంటి కంగారూ రక్షణను తండ్రి కూడా ఇవ్వవచ్చు. శిశు సంరక్షణలో తల్లిదండ్రులిద్దరూ భాగస్వాములే.