సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ శుక్రవారం
హోరాహోరీగా కోర్టులో ముకుల్ రోహత్గీ, హరీష్ సాల్వే వాదనలు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం విచారణను శుక్రవారం 13వ తేదీ మధ్యాహ్నానికి కేసు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. సెక్షన్ 17ఎ అవినీతిపరులను రక్షించడానికి ఉద్దేశించినది కాదని, నిజాయితీపరులను రక్షించడానికి ఉద్దేశించినదని రోహత్గీ వాదించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు చంద్రబాబును నిందితుడిగా పేర్కొనలేదని, విచారణ ఇంకా కొనసాగుతోందని, అందుకే ఆయనకు సెక్షన్ 17ఎ వర్తించదని వాదించారు.
రేపు ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై పిటిషన్లపై విచారణ
సీఐడీ దాఖలు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో ఈరోజు కేసులను విచారించాల్సిన ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.