బంగ్లా అనిశ్చితిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదు. రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. బంగ్లాదేశ్‌లో అనిశ్చితి కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి వేలాది మంది భారత సరిహద్దులవైపు చొచ్చుకు వస్తున్నారు. దీనితో భారత వీసా దరఖాస్తు కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. భారత్ వీసా కోసం అప్లయ్ చేసుకునే ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను అస్థిర పరిస్థితుల వల్ల తదుపరి నోటీసులిచ్చే వరకూ మూసివేస్తున్నాం అని, తదుపరి దరఖాస్తు తేదీలపై సమాచారం త్వరలోనే తెలియజేస్తాం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో భారత హైకమిషన్, కాన్సులేట్‌లో పనిచేసే సిబ్బంది, వారి కుటుంబాలను ఇప్పటికే దిల్లీకి తీసుకువచ్చారు. అత్యవసర దౌతవేత్తలు మాత్రం బంగ్లాలోనే ఉంటారు. భారత్‌కు బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్, ఢాకా, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్‌హెట్ నగరాలలో కాన్సులేట్లు ఉన్నాయి.