Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page slider

ఇకపై సింగిల్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులు

రాష్ట్రంలో కిరాణ కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలకు సింగిల్ పోర్టల్ విధానం ద్వారానే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సుమారు 750 భారీ పరిశ్రమలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలు త్వరగా క్షేత్రస్థాయిలోకి వచ్చేలా పరిశ్రమల శాఖ, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిరంతరం ట్రాక్ చేయాలని సూచించారు. ప్రతినెలా కొన్ని ప్రాజెక్టులకైనా భూమిపూజలు, ప్రారంభోత్సవాలు జరిగేలా వేగంగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రాబోయే నవంబరులో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు నాటికి సాధ్యమైనంత ఎక్కువగా పరిశ్రమల స్థాపన పనులు ప్రారంభం కావాలని మంత్రి పేర్కొన్నారు. గత సదస్సుల కంటే ఈసారి అత్యధికంగా పరిశ్రమలను ఆకర్షించేందుకు దేశ, విదేశాల్లో భారీగా రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

భోగాపురం విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో హోటల్ గదుల లభ్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ సూచించారు. అలాగే అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలు ఉక్కు హబ్‌గా మారుతున్నందున, కొత్త పరిశ్రమల కోసం ముడిసరకు సరఫరాకు అవసరమైన స్లరీ పైప్‌లైన్‌ ఏర్పాటుపై అధికారులు అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న టెక్స్‌టైల్ పరిశ్రమలకు ఏడాది పాటు బ్యాంకింగ్ ఫెసిలిటీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, కొత్తగా గార్మెంట్ రంగాన్ని ఆకర్షించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.