వైభవ్‌కి మంజ్రేకర్ సూచన: ‘టెక్నిక్’ మారాలి!
ఐపీఎల్-2026లో తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, సుదీర్ఘ కెరీర్ కోసం కొన్ని మార్పులు చేసుకోవాలని సూచించారు. వైభవ్ సూర్యవంశీకి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై సెంచరీ, ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్న తీరును ఆయన ప్రశంసించారు. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్‌సైడ్‌లో షాట్లు కొడుతున్నాడు. ఇది కేవలం టీ20లకు మాత్రమే సరిపోతుందని మంజ్రేకర్ పేర్కొన్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పిచ్‌లపై రాణించాలంటే టెక్నికల్‌గా ఇంకా మెరుగుపడాలని, బంతికి దగ్గరగా వెళ్లి ఆడటం నేర్చుకోవాలని సూచించారు. టీ20 క్రికెట్ ద్వారా డబ్బు, పేరు రావచ్చు కానీ, నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్లో రాణిస్తేనే దక్కుతుందని మంజ్రేకర్ స్పష్టం చేశారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. అయితే వైభవ్ సీనియర్ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రస్తుతానికి టీమ్ ఇండియాలో ఓపెనింగ్ స్థానం కోసం భారీ పోటీ నెలకొంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి వారు ఇప్పటికే తమ సత్తా నిరూపించుకున్నారు. వీరితో పాటు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి సీనియర్లు కూడా రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

