Home Page SliderTelangana

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా


టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతి పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ప్రకటించారు. దీంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిరుపేద కుటుంబం కావడంతో ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగత హోదాలో మరో రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో, మొత్తంగా ఆ కుటుంబానికి రూ. 15 లక్షల సాయం అందనుంది.

గత 25 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందించిన శంకర్ గౌడ్ కుటుంబం తీవ్ర పేదరికంలో ఉంది. ఆయన భార్య హేమలత దివ్యాంగురాలు కావడం, సొంత ఇల్లు లేకపోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆయనకు భార్యతో పాటు కుమార్తె షామిలి, కుమారుడు హేమంత్ ఉన్నారు. ఆర్డీవో స్వయంగా మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

శంకర్ గౌడ్ అంత్యక్రియల వేళ ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన మృతదేహాన్ని నర్సంపేట బస్ డిపో వద్దకు తీసుకెళ్లాలని కార్మికులు, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పట్టుబట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.