దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చిట్
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు . వీరిద్దరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను విచారించిన స్పీకర్, వాటిని డిస్మిస్ చేస్తున్నట్లు బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఈ ఇద్దరు నేతలు, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారన్న ఆరోపణలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని సదరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, వారు ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు.ఈ విచారణ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఎంపీగా పోటీ చేయడం వ్యక్తిగత విషయమని, హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పని చేయలేదని, పార్టీ తనకు ఎక్కడా విప్ జారీ చేయలేదని స్పీకర్‌కు వివరించారు. తాను చట్టపరంగా ఏ తప్పూ చేయలేదని, స్పీకర్ తనపై అనర్హత వేటు వేసినా న్యాయపోరాటం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ ఈ వివరణలతో ఏకీభవిస్తూ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.మరోవైపు, పార్టీ ఫిరాయింపుల అంశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణల సందర్భంగా కేసు మళ్ళీ కోర్టు ముందుకు వచ్చేలోపే నిర్ణయం తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పీకర్‌కు సూచించిన నేపథ్యంలో, ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంలకు ప్రస్తుతానికి ఊరట లభించినప్పటికీ, సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పోరాడతామని ఇప్పటికే ప్రకటించారు.

