పరకామణి చోరీ మామూలు దొంగతనం కాదు
అమరావతి: తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, పరకామణిలో జరిగే చోరీలను మామూలు దొంగతనంగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది. కోట్లాదిమంది భక్తులు కానుకల రూపేణా సమర్పించిన సొమ్ము చోరీకి గురయితే వారి మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు కానుకల లెక్కింపు విధానంపై టీటీడీకి పలు కీలక సూచనలు చేసింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరుగుతున్నా పాత విధానాన్ని అనుసరించడం సరికాదని స్పష్టం చేస్తూ, మానవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వినియోగించాలని సూచించింది. అంతేకాక, “ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. టీటీడీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు సరికాదు. కానుకలు లెక్కింపునకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదు” అని తేల్చిచెప్పింది. లెక్కింపు వద్ద టేబుళ్లు ఏర్పాటు చేయాలని, సేవాభావంతో వచ్చిన భక్తులను లెక్కింపు కోసం ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. అలాగే, సేవాభావంతో వచ్చిన భక్తులను దుస్తులు లేకుండా సోదాలు చేయడం, దొంగల్లా అవమానించడం తగదని పేర్కొంది.
పరకామణి చోరీపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా హైకోర్టు ఈ విచారణలో స్పందించింది. రవికుమార్ అనే వ్యక్తి ఏదో చిన్న దొంగతనం చేశాడు, కానీ అందుకు ప్రాయశ్చితంగా టీటీడీకి ₹14.4 కోట్లు విరాళంగా ఇచ్చాడంటూ మాజీ ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కంటే పెద్దదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు చిన్న విషయం కాదని పేర్కొంది.
పరకామణి చోరీని ‘చిన్న దొంగతనం’గా అభివర్ణించిన జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, జగన్కు దేవుడన్నా, ఆలయాల పవిత్రత అన్నా ఏమాత్రం లెక్కలేదని మండిపడ్డారు. “దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి చెల్లించాడు కదా, తప్పేముందని జగన్ వాదించడం అనైతికం” అని అన్నారు. “బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?” అని చంద్రబాబు తీవ్రంగా ప్రశ్నించారు. ఈ కేసులో సతీష్ కు సంబంధించిన కేసు లోక్ అదాలత్ లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.

