News

జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కృత్రిమ మేధ టెక్‌ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. దీని వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. సర్వం ఏఐమయమౌవుతుందన్న వాదనల నేపథ్యంలో ఈ సాంకేతికతపై మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 18 నెలల్లో తమ కంపెనీకి చెందిన కోడింగ్‌ కృత్రిమ మేధనే చేస్తుందన్నారు.తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జుకర్‌బర్గ్‌ మెటాలో కృత్రిమ మేధ పాత్ర గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పటికే ఓ బృందంలో సభ్యుడిగా విధులు నిర్వహిస్తోందన్నారు. త్వరలోనే టాప్‌ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మీరు ఏదైనా లక్ష్యాన్ని ఇస్తే.. ఏఐ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. బగ్‌లను కనుగొంటూ, అధిక- నాణ్యత కోడ్‌ను స్వతంత్రంగా రాయగలదని జుకర్‌బర్గ్‌ భావించారు. రానున్న 12-18 నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలావరకు కోడింగ్‌ను ఏఐయే పూర్తిచేస్తుందని జుకర్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు.