Home Page SliderNational

మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం

మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క పూణెలోనే 27 కేసులు నమోదయ్యాయి. ఈడిస్ అనే జాతి దోమల ద్వారా ఈ జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇదే జాతి దోమల వల్ల డెంగీ, చికున్ గున్యా కూడా వ్యాప్తి చెందుతాయి. జికా వైరస్ వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి, కడుపులోని పిండానికి ప్రమాదం జరగవచ్చు. ఇది గర్భస్థ శిశువుల మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. జికా వైరస్ వల్ల శిశువులు చిన్న తలతో పుట్టడం, చూపు, వినికిడి తగ్గడం, మూర్ఛ వంటి సమస్యలు రావచ్చు.

లక్షణాలు:

జికా వైరస్ వల్ల ఇన్‌ఫెక్షన్ ఏర్పడినప్పుడు జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, చర్మం మీద దద్దుర్లు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ జర్వానికి కూడా ఇంచుమించు ఇవే లక్షణాలు ఉంటాయి. దోమ కుట్టిన మూడు రోజుల నుండి రెండు వారాలలోపు ఈ లక్షణాలు బయటపడవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే తాత్కాలిక పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అవయవాలు చచ్చుబడడం పాదాల వద్ద మొదలై శరీరం పైకి వ్యాపిస్తుంది. మూత్ర, మల విసర్జన ఆగిపోవడం, కాళ్లు చచ్చుబడడం, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వెన్నుముకలో వాపు కలగవచ్చు.

వ్యాధి నిర్థారణ:

జికా వైరస్‌ను నిర్థారించడానికి పీసీఆర్ పరీక్ష చేస్తారు. రక్తం, మూత్రం, ఇతర స్రావాలలో జికా వైరస్ ఉంటుంది. అందుకే ఈ పరీక్షలు చేస్తారు. జికా ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి, గర్భిణులకు, నవజాత శిశువులకు ఈ పరీక్ష చేయడం చాలా మంచిది.

చికిత్స:

జికాకు ప్రత్యేకంగా టీకాలు లేవు. ఇతర వైరస్ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గడానికి ప్రతీ 6 గంటలకు పార్సిటమాల్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకుని, నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవడం, పరిశరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే జికాను కలిగించే దోమల వ్యాప్తిని  అరికట్టవచ్చు.