రాజకీయ కుట్ర వెనుక వైవీ సుబ్బారెడ్డి, బాలినేని పరోక్ష వ్యాఖ్యలు
ఇటీవల తనకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి తాను ఎవరిపైనా, ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేశానన్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమించానన్నారు. కానీ కొందరు తనపై నిందలు వేస్తున్నారని, అనవసర ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. గోనె ప్రకాషరావుతో తన గురించి ఎవరో మాట్లాడిస్తున్నారని బాలినేని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ బాలినేని కంటతడి పెట్టారు. తనపై రాజకీయ కుట్రకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కారణమన్న అభిప్రాయాన్ని పరోక్షంగా బాలినేని చెప్పారు.

వైఎస్సార్ తనకు రాజకీయభిక్ష పెట్టారన్నారు. తాను పార్టీ కోసమే పనిచేస్తుంటే కొందరు అలుసుగా తీసుకుంటున్నారన్నారు. అనవసరంగా బురదజల్లుతున్నారన్నారు. ఎన్నికల్లో తాను టికెట్ ఇప్పించినవారే, రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారన్నారు. ఐతే, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిలా పార్టీకి నష్టం కలిగించబోనన్నారు. త్వరలోనే పార్టీ హైకమాండ్ వివాదాలకు ముగింపు పలుకుతుందన్నారు. 3 జిల్లాల్లో గడపగడపకు తిరగలేక కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానన్నారు బాలినేని.