Andhra PradeshHome Page Slider

వంద రోజులకు చేరుకున్న యువగళం పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. జనవరి 27న మొదలైన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. ఈ పాదయాత్ర సోమవారానికి 100 రోజులకు చేరనుంది. కుప్పంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన లోకేష్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో యాత్రను నిర్వహిస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పాదయాత్రకు పోలీసులు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ వాటన్నిటిని అధిగమిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.

పలు సామాజిక వర్గాల ప్రతినిధులు, గ్రామాల ప్రజలు, రైతులు, యువతతో ఇలా అనేకమందితో లోకేష్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ సెల్ఫీలతో ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర ఈ నెల 15వ తేదీకి వంద రోజులు మైలు రాయిని చేరనుంది. దీంతో పాదయాత్రకు సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు.

వంద రోజులకు చేరుకుంటున్న సందర్భంగా నేడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావంగా పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మంది పార్టీ శ్రేణులతో ఏడు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వారి వారి నియోజకవర్గాల్లో జరిగే సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం పిలుపునిచ్చింది.