జనవరి 15న ‘యువ శక్తి’ సభ
జనసేన పార్టీ తాజాగా యువ శక్తి పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. మొదటి సభ జనవరి 15న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే యువ శక్తి సభలు నిర్వహిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించకుండా మానవత్వం మరిచి పరిపాలన చేస్తుందన్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువ శక్తి సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పలు జిల్లాల్లో యువ శక్తి సభలు జరుపుతామని నాదెండ్ల స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు.
