సంక్షేమానికీ, అభివృద్ధికీ మానవతా ముద్ర వేసిన మహానేత-వైఎస్ రాజశేఖరరెడ్డి
తెలుగు ప్రజల మనసుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదు… ఒక నమ్మకం. సంక్షేమానికి, అభివృద్ధికి, మానవీయతకు సాక్షాత్ చిరునామాగా నిలిచిన మహనీయుడు. సీఎంగా కేవలం ఐదేళ్లు మూడు నెలలు పనిచేసినా, తన పాలనతో కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. ఆయన పాలన అనేది ప్రజల శ్వాసగా మారింది. అందుకే, ఆయన మరణించి 15 ఏళ్లు గడిచినా ప్రజలు ఇంకా ఆయనను మరిచిపోలేకపోతున్నారు.
రైతు రాజ్యం,ఉచిత విద్యుత్తుతో ప్రారంభమైన శాస్వత సంకల్పం
2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, తొలి సంతకం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై చేశారు. రూ.1,100 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. 35 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. మొదటి సంవత్సరం రూ.400 కోట్లుగా ప్రారంభమైన సబ్సిడీ, ఏడాదిలోనే రూ.6,000 కోట్లకు చేరినా ఒక్క అడుగు వెనక్కు వేయలేదు.చంద్రబాబు సహా పలువురు ఆ ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేసినా, పాలనలోకి వచ్చాక అదే పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మాదిరే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ప్రారంభించాయి.
జలయజ్ఞం సాగునీటి రంగంలో అరుదైన రికార్డు
నదీ జలాలను సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే సంకల్పంతో జలయజ్ఞం ప్రారంభించారు. రూ. లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో 41 ప్రాజెక్టులను పూర్తిచేశారు. ఫలితంగా 23.49 లక్షల ఎకరాలకు నీరందేలా చేశారు. ఇదే రాష్ట్రాభివృద్ధికి మెట్టుపెట్టిన అసలైన చైతన్యం.
ఆరోగ్యశ్రీ కార్పొరేట్ వైద్యం పేదల పరిధిలోకి
పేదల జీవితాల్లో వైద్యం ఒక భయంగా ఉన్న రోజుల్లో, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేశారు. పేదల జేబులో పీక్కుడు నొప్పి లేకుండా ప్రాణాలను కాపాడే మార్గాన్ని చూపారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ ను రూపొందించింది.అంతేకాదు, 108, 104 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించి అత్యవసర వైద్యసేవను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లారు.
ఫీజు రీయింబర్స్మెంట్,పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశం
“పేదవాడు డాక్టర్ కావాలి, ఇంజినీర్ కావాలి” అన్నదే వైఎస్సార్ ఆకాంక్ష. అందుకే, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులు ప్రభుత్వ ఖర్చుతో మెడిసిన్, ఇంజినీరింగ్ చదివేలా చేశారు. జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు, హార్టికల్చర్ యూనివర్సిటీ, పశువైద్య కళాశాలలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐటీ – ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఆయన చేతుల మీదుగా వెలుగు చూశాయి.
పావల వడ్డీ రుణాలు,మహిళలకు ఆర్థిక స్వావలంబన
పొదుపు సంఘాల మహిళలకు పావల వడ్డీ రుణాలు అందించడమేగాక, మైక్రో ఫైనాన్స్ దౌర్జన్యాలకు బ్రేక్ వేశారు. ఈ పథకం ఆర్థిక స్వాతంత్ర్యానికి చుట్టూవారిని ఆశ్రయించే బాధ్యతలను తగ్గించింది. పారిశ్రామిక వృద్ధికి దారి
వైఎస్సార్ హయాంలోనే రాష్ట్రం పెట్టుబడుల బూమ్‌కు వేదికైంది. శ్రీ సిటీ SEZ నుంచి గంగవరం పోర్ట్ వరకు, శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి ఐటీ పార్కుల దాకా అభివృద్ధి ప్రవాహంగా కొనసాగింది. రాష్ట్ర ఎగుమతులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఐటీ ఎగుమతుల్లో 566% వృద్ధి చోటుచేసుకుంది.
అర్థిక మాంద్యానికి అడ్డుకట్ట
2007,09 మధ్య ప్రపంచమంతా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. కానీ వైఎస్సార్ పాలనలో ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి పథకాలు నిలిపివేయక, మార్కెట్‌లో నగదు ప్రవాహాన్ని కొనసాగించడంవల్ల రాష్ట్రం ఆ ముప్పును అధిగమించగలిగింది.
ప్రజాప్రస్థానం
2003లో కాంగ్రెస్ పార్టీ మృతసంజీవని స్థితిలో ఉన్నప్పుడు, వైఎస్ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాకా 1,475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి పార్టీకి ప్రాణం పోశారు. ఈ పాదయాత్రే కాంగ్రెస్‌ను 2004లో రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి తెచ్చింది. ఇదే యాత్ర ద్వారా ప్రజల బాధలు నేరుగా తెలుసుకున్నారు. అందుకే ఆయన నిర్ణయాలు అందరినీ తాకినవిగా నిలిచాయి.
ప్రజల కోసం అంకితమైన జీవితం
1949 జూలై 8న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జన్మించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, డాక్టర్‌గా తన ప్రయాణం ప్రారంభించి, చివరికి ప్రజల జీవితాలే తన లక్ష్యంగా మార్చుకున్నారు. ఒక రూపాయికి వైద్యం చేసే “రూపాయి డాక్టర్”గా అభిమానాన్ని సంపాదించారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చి, 2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాత్తుగా మృతిచెందే వరకు ప్రజలకు సేవ చేశారంటే అతిశయోక్తి కాదు.
చిరంజీవిగా నిలిచిన చిహ్నం-వైఎస్సార్
నమస్తే అక్కయ్యా, నమస్తే తమ్ముడూ అని ఆప్యాయంగా పలికే స్వరం ఇంకా తెలుగువారి చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ప్రజల మధ్య బంధాన్ని రాజకీయ అస్త్రంగా మార్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
వైఎస్సార్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు అది ఒక భావన, అది ఒక స్ఫూర్తి, అది ప్రజల కలల పాలనకు పెట్టిన ముద్ర.