చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, “ఇరవై ఏళ్ల పాటు చంద్రబాబుకు హైదరాబాద్‌తో ఏ సంబంధమూ లేదు” అని వ్యాఖ్యానించారు.
హైటెక్ సిటీ స్థాపనకు నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది వేసినా, ఇప్పుడు చంద్రబాబు దానిని తన కృషిగా ప్రచారం చేసుకుంటున్నారని జగన్ విమర్శించారు. “2003-04లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నిజమైన అభివృద్ధి ప్రారంభమైంది. అనంతరం కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది,” అని ఆయన ప్రశంసించారు.
చంద్రబాబు పాలన శైలిపై విమర్శలు కొనసాగిస్తూ, “నిజాలను అంగీకరించని నేత చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు” అని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అన్నీ ఖాళీ మాటలేనని అన్నారు.
“ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ హామీలు నెరవేర్చలేదు. జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ప్రతి నెలా జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది,” అని జగన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చిన ఘనత తమదేనని, టీడీపీ హయాంలో ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.