రాజధానిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ జగనన్న విద్యా దీవెన పథకం నిధులను లబ్ధిదారులకు బటన్ నొక్కి రిలీజ్ చేశారు. 11.02 లక్షల మంది తల్లిదండ్రుల ఖాతాల్లో 694 కోట్లు జమచేశారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 12,401 కోట్ల తల్లుల ఖాతాలో జమ చేసిందన్నారు జగన్. ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదనే విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని.. పేదల బాగు కోసం పనిచేస్తోందని చెప్పిన జగన్… ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమావధి కాదని.. తనకు తానుగా ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయించే శక్తి లభించడమే విద్యకు పరమార్థమని… ప్రఖ్యాత సైంటిస్టు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వ్యాఖ్యలను గుర్తు చేసిన జగన్… ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరవడిన ఆలోచన శక్తి, వివేకం ప్రతిపక్షాలకు కలగాలని దేవుడ్ని కోరుకుంటున్నాన్నారు జగన్. పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివించేలా మనుషులకు సంస్కారం లభించాలన్నారు. నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి మనుషులంతా ఒక్కటేనన్న మానవతావాదంతో కలగాలన్నారు.

పలానా ప్రాంతాల్లో పలానా భూములు ఉన్న చోట మాత్రమే రాజధాని కట్టాలన్న ఆలోచన నుంచి ప్రతిపక్షాలు బయటపడేలా జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలన్నారు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సామాజిక సమతూల్యం దెబ్బతుంటుందని వాదించేవారి ఆలోచనల్లో మార్పు రావాలని దేవుడ్ని కోరుకుంటున్నానన్నారు జగన్. నవరత్నాల పాలనతో పేదలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక, పేదలు బాగుపడటం ఇష్టంలేక పెత్తందార్లందరూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ బటన్ నొక్కి ప్రజలకు మంచి చేస్తుంటే… పుట్టగతులుండవని… జగన్ బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందటున్నారని విమర్శించారు. అదే వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అమెరికా అని చెప్పేవారన్నారు. దుష్ప్రచారం చేస్తున్నవారికి ఇంగిత జ్ఞానం ఇవ్వాలని దేవుడ్ని కోరుతున్నానన్నారు జగన్. రైతులను మోసం చేసిన బాబు ఇవాళ వ్యవసాయం గురించి, పిల్లలకు న్యాయం చేయని చంద్రబాబు ఎడ్యుకేషన్ గురించి, అక్కచెల్లెల్లకు ద్రోహం, దగా చేసిన బాబు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనార్టీలను అవమానించి అన్యాయం చేసిన బాబు ఇవాళ సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి వాళ్లు లెక్చర్లు దంచుతుంటే రాష్ట్ర ప్రజలంతా ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారంటూ టీడీపీ చేపట్టిన ఆందోళనపై జగన్ సైటర్లు వేశారు.

పెత్తందారి మనస్తత్వాలు ఉన్న బాబు, దత్త పుత్రుడు, ఒక వర్గం మీడియా దుష్ర్చచారం చేస్తోందన్నారు జగన్. అలాంటి వారిని నమ్మొద్దన్నారు. కేవలం ఒకటే కొలమానం తీసుకోవాలన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదా అన్నది కొలమానంగా తీసుకోండన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండాలన్నారు. ఇవాళ యుద్ధం చేస్తోంది మంచోళ్లతో కాదని.. రాక్షసులు, మారీచతులు, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతోనన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం బటన్ నొక్కి పేదలకు ఎందుకు సాయం చేయలేదని జగన్ ప్రశ్నించారు. కారణం.. అప్పుడంతా గజదొంగల ముఠా ఉండేదన్నారు. గజదొంగల ముఠా పేరు దుష్ట చతుష్టయమన్నారు. దోచుకో.. పంచుకో… తినుకో… డీపీటీ అనే పద్ధతిలో రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అలాంటి వ్యవస్థ గురించి ఎవరూ ప్రశ్నించరని… రాయరన్నారు జగన్. మీ బిడ్డ ఇలాంటి పత్రికలను, టీవీ చానెళ్లు, దత్త పుత్రుడిని నమ్ముకోలేదని… దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నాడన్నారు. టీవీ చానెళ్లు, పేపర్లు, దత్త పుత్రుడు లేకున్నా.. జగన్‌లో నిజాయితీ ఉందన్నారు. ఏదైతే చెబుతాడో అది చేసి చూపిస్తాడన్నారు. ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగాను, ఖురాన్ గానూ బైబిల్‌గా భావించి…98 శాతం హామీలను పూర్తిగా అమలు చేశాక.. ప్రజప్రతినిధులు, ఎమ్మెల్యేల గడపగడపకు పంపిస్తున్నానన్నారు. నాటి పాలకులకు, నేటి పాలనకు తేడా చూడాలన్నారు జగన్. రాజకీయాల్లోకి మొదటిసారిగా జవాబు దారితనం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు.