బాలకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా పరిశ్రమపై జరిగిన చర్చ మరోసారి రాజకీయ వేడిని రేపింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించిన ఈ అంశాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనసాగించగా, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
తాజాగా ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో బాలకృష్ణ ప్రవర్తనపై ప్రశ్నించగా, “అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయమేమిటి? ఆయన మాట్లాడింది ఏమిటి? పనిలేని సంభాషణ చేశారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీలో మాట్లాడారు. అలాంటి వ్యక్తిని సభలోకి అనుమతించడం స్పీకర్ తప్పిదం” అని జగన్ విమర్శించారు.
అదేవిధంగా, “బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఆయన మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. తన సైకాలజికల్ స్థితి గురించి ఆయనే ఆలోచించుకోవాలి” అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, అసెంబ్లీలో ఈ అంశంపై వచ్చిన విమర్శలపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే స్పందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రస్తావన చేసిన రోజే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “సినీ పరిశ్రమపై ఎలాంటి అవమానం జరగలేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎంతో గౌరవంగా ఆహ్వానించారు” అని చిరంజీవి స్పష్టం చేశారు.