చదువుల తల్లిగా దుర్గమ్మ దర్శనం
◆దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
◆ ఇంద్రకీలాద్రి పై కిక్కిరిసిన భక్తజనం
◆ అమ్మవారిని దర్శించుకున్న మూడు లక్షల మంది భక్తులు
అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున చదువుల తల్లి సరస్వతి దేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రులలో ఎంతో విశిష్టత కలిగిన మూలా నక్షత్రం పర్వదిన నేపథ్యంలో చదువుల తల్లిగా కొలువుతీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. మూడు లక్షల మంది వరకు ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపు నుండి ఆయన పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు.

మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ప్రతి ఆట ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేసి అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
