చంద్రబాబుకు ముందుచూపు లేకే ఏపీ రైతులు నష్టపోయారన్న జగన్
ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా ఏపీలో భారీవర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన గ్రామాలను జగన్ శుక్రవారం కలియ తిరిగి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోతాడని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌కు పాలన గురించి ఏమీ తెలియదని ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. ఏలేరు రిజర్వాయర్ కింద వరదలొస్తాయని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. రిజర్వాయర్ మేనేజ్‌మెంట్‌ను పట్టించుకోలేదని, ఇది ప్రకృతి సృష్టించిన విలయం కాదని అన్నారు. ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని, ప్రజల పట్ల మానవత్వం చూపడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటివరకు రైతులకు రైతుబీమా, రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీలు అందించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగనే కారణమంటూ జగన్ నామాన్ని జపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం కేవలం ఫొటోలకే పరిమితమైందని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే రోజులు సమీపిస్తున్నాయని స్పష్టం చేశారు.