Andhra PradeshHome Page Slider

రూటు మార్చిన జగన్

  • మరింత ఉత్సాహంతో జిల్లాల పర్యటనలు
  • హెలిపాడ్ వద్దే ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీలు
  • దసరా పండుగ నుండి సంక్రాంతి వరకు అదే జోరు
  • అందరిలోనూ ఐక్యత నింపేలా దిశా నిర్దేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని మరింత వేగవంతంగా ముందుకు నడిపించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా మరింత వేగవంతంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే దసరా పండగను పురస్కరించుకొని తమ కార్య కలాపాలను మరింత దూకుడుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. దసరా నుంచి సంక్రాంతి వరకు అదే జోరుతో తనతో పాటు పార్టీ శ్రేణులంతా మరింత ఉత్సాహంతో కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేలా జగన్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు రూట్ మ్యాప్ లు కూడా సిద్ధమయ్యాయి.

ఒకవైపు ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 10 వరకు నిర్వహించబోతున్నారు. అలాగే ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 60 రోజులపాటు బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. వీటితోపాటు జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ స్థానిక నేతలతో సమావేశం కావడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే హెలిపాడ్ల వద్ద రెండు గంటల పైగా ముఖ్య నేతలతో గడపటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. వారంలో రెండు జిల్లాల్లో పర్యటించేలా కార్యక్రమాలను రూపొందించుకుంటూ జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇక విజయదశమిని పురస్కరించుకొని పార్టీ పరంగా కార్యక్రమాలను మరింత దూకుడుగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న నాలుగు నెలల్లో పార్టీ పరంగా మరింత బలమైన పునాదులను క్షేత్రస్థాయిలో నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన వైఎస్ఆర్సిపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. జగన్ కూడా 2024 లో జరిగే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. పలు సమావేశాల్లోనూ బహిరంగ సభల్లోనూ ఆయన పార్టీ శ్రేణులకు ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. దీంతో దసరా నుంచి సంక్రాంతి వరకు రానున్న మూడు నెలలు నిత్యం ప్రజలలో ఉండాలని ఆ దిశగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే నాలుగు కార్యక్రమాలను రూపొందించారు. ఏది ఏమైనా తన రూటును మార్చి రానున్న 100 రోజులు పార్టీ శ్రేణులు అంతా ప్రజల్లోనే ఉండేలా సీఎం జగన్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.