చంద్రబాబు, మోడీ మధ్యలో వైఎస్ జగన్ (ఎక్స్‌క్లూజివ్)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పొత్తుపై ప్రకటన వెలువడుతుందనే ఉత్కంఠకు తెరపడింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు అవకాశం, రెండు పార్టీలు కలిసి వైసీపీపై గెలవగలదా లేదా అన్నదాని ఆధారంగానే నిర్ణయించబడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ నేపథ్యంలో పొత్తుపై ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఇరుపక్షాలు నిరాకరించాయి. పొత్తు ఎట్టకేలకు రూపుదిద్దుకుంటుందో లేదో ప్రకటించడం తొందరపాటు అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

జూన్‌లో చంద్రబాబునాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాజీ మిత్రపక్షాలు బంధాన్ని పునరుద్ధరించుకోవచ్చని ఊహాగానాలు విన్పించాయి. ఏపీలో బోగస్ ఓటర్ల గురించి భారత ఎన్నికల కమిషన్‌కు తెలియజేసేందుకు చంద్రబాబు వచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. అదే సమయంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని 2018లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. నాటి పొత్తును తిరిగి పునరుద్ధరించడానికి టీడీపీ నుంచి ఫీలర్లు వస్తున్నప్పటికీ… పొత్తును తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, సైకిల్ పార్టీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను రాబడుతుందన్నదానిపైనే బీజేపీ క్లారిటీతో లేదని తెలుస్తోంది.

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు ఏపీలో బీజేపీ ప్రభావం పాక్షికమే అయినా, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ, కేంద్ర ప్రభుత్వ ప్రజానుకూల పథకాలపై సానుకూలత ఉందంటున్నారు. ఏపీలో బీజేపీని ప్రత్యామ్నాయంగా కొందరు చూస్తున్నారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఓట్ షేర్ 0.85%. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. 2019లో 39.17% ఓట్లతో 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ.. 40.19% ఓట్లతో కేవలం మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే పొందగలిగింది. వైఎస్సార్‌సీపీ 49 శాతం ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా 49.89% ఓట్లతో 22 స్థానాలను గెలుచుకుంది.

ఏపీలో ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు టీడీపీ మనుగడ కోసం పోరాటమని బీజేపీ ముఖ్యులు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ తన పట్టును బలోపేతం చేసుకుందని, బీజేపీ, జనసేన, టీడీపీ బలీయమైన కలయిక అని నమ్మే ఒక వర్గం ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని బీజేపీ యోచిస్తోంది. బీజేపీని టీడీపీ పొత్తు కోసం ఆహ్వానిస్తున్నప్పటికీ… కమలం పార్టీ అధినాయకత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. అందుకు కారణం వైసీపీ, బీజేపీ మధ్య సాన్నిహిత్యం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ-బీజేపీ పొత్తు తేలకపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారారు. పార్లమెంట్‌లో కీలక బిల్లులకు కీలకమైన మద్దతునిస్తూ, బీజేపీతో వైసీపీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ నెలలో ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వడంతో పాటు లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ తన స్థానాన్ని పటిష్టం చేసుకుని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో రాష్ట్ర ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ తనను తాను ప్రూవ్ చేసుకున్నట్టుగా బీజేపీ భావించడం లేదని తెలుస్తోంది.