కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలతో సీఎం జగన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నెలరోజుల వ్యవధిలోని రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేపట్టి గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న జగన్ తొలుత ఆర్థికమంత్రిని కలవాలని అనుకున్నప్పటికీ వీలుపడలేదు. బుధవారం రాత్రి ఆలస్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమైన జగన్ గురువారం ఉదయం ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించాలని ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది. అయితే కేంద్రం బిల్లులను తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుండటం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం పైన ఆ ప్రభావం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లతో అడ్ హక్ నిధిని ఏర్పాటు చేసినట్లయితే ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. గురువారం నిర్మలా సీతారామన్ తో జరిగిన భేటీలో ఈ విషయం పైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుల పనులకు 2020 కోట్లు ఖర్చు అవుతుందని ఆ మేరకు నిధులు విడుదల చేస్తే రుతుపవనాలు ప్రవేశించి మళ్లీ వరదలు వచ్చేలోగా మరమ్మత్తు పనులు పూర్తి చేయవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇతర అంశాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి విడుదల చేయాల్సిన బకాయిలు 2500 కోట్లు ఉన్నాయని వెంటనే ఈ డబ్బును కూడా మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.

