ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైయస్ జగన్ ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టేందుకు బుధవారం రాత్రి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రిటైర్డ్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. విమానాశ్రయంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులను ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ కు పరిచయం చేశారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహార్ రెడ్డి, డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తదితర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అధికారులు గవర్నర్ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ భవన్ కు చేరుకున్న అబ్దుల్ నజీర్ కు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం రాజ్ భవన్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
