యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి రావాలి : పవన్ కళ్యాణ్
యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి రావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్బోధించారు. యువత భవిష్యత్తును ఉద్దేశించే తన పార్టీని స్థాపించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన యువత రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. అప్పుడే రౌడీలు గుండాలు రాజకీయాల నుంచి కనుమరుగవుతారన్నారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సర్పవరం సెంటర్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రౌడీలు ,గుండాలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. కేవలం పాతికమంది చేతిలో కర్రలు కత్తులతో జనాన్ని శాసించగలగుతున్నారన్నారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ నగరం అంటే ప్రశాంతతకు నిలయమని పవన్ చెప్పారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ ప్రాంతాన్ని స్వర్గధామంగా భావించే వారన్నారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు దోపిడీలకు కబ్జాలకు నిలయంగా మారిందన్నారు.

గత నాలుగేళ్లుగా యువత నిర్వీర్యమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. నేరస్తులు పాలిస్తుంటే మీకు సిగ్గు వేయడం లేదా అంటూ పవన్ యువతను నిలదీశారు. తాను మాత్రం ఈ పరిస్థితిని సహించేది లేదని ప్రకటించారు. నేరస్తులను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. ఖాళీ స్థలాలు కనపడితే కబ్జా చేస్తున్నారన్నారు. సర్వేల పేరిట స్వంత మనుషులని ఇంటింటికి తిప్పుతూ కేవలం వృద్ధులు మాత్రమే ఉన్న ఇళ్లపై పాలకులు దృష్టి పెట్టారన్నారు. విచ్చలవిడిగా గంజాయి మాదకద్రవ్యాలను అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు సరఫరా చేస్తున్నారన్నారు. యువతను కీలుబొమ్మలుగా మార్చేశారని వెయ్యి కి రెండు వేలకు తమ వెంట దాసోహం అంటూ తిప్పుకుంటున్నారన్నారు. ఈ పరిస్థితిని మార్చటమే జనసేన ధ్యేయమని పవన్ స్పష్టం చేశారు.