Breaking NewsHome Page SliderNationalPolitics

మీరే పెద్ద తాగుబోతులు.. బీజేపీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ అసెంబ్లీలో విపక్ష బీజేపీ ఎమ్మల్యేలపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో శాసనసభ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఛప్రాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమావేశాల్లో రెండో రోజు బుధవారం సభలో బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. అధికార పార్టీని ఈ ఘటనపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లనే ఏడుగురు మరణించారని అసెంబ్లీలో ప్రశ్నించారు. మద్యపాన నిషేదం ఏమైందంటూ సభలో నితీష్‌ను బీజేపీ సభ్యులు నిలదీశారు.

దీంతో సభలో ఉన్న సీఎం నితీష్‌కుమార్‌ ఒక్కసారిగా లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. బీజేపీ సభ్యులు అబద్దాలు చెబుతున్నారన్నారు. డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మధ్య నిషేధం గురించి మీరా మాట్లాడేది… మీరే పెద్ద తాగుబోతులు” అంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. నితీష్‌ కాలం ముగిసిందని బీజేపీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. ఆయన తరుచుగా సహనం కోల్పోతున్నారని… సీఎం వైఖరి సరిగా లేదని ఆయన పేర్కొన్నారు.