గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి
మహారాష్ట్రకు చెందిన వర్ధమాన క్రికెటర్ గుండెపోటుతో గ్రౌండ్‌లోనే మరణించిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఛత్రపతి సంభాజినగర్ (పూర్వపు ఔరంగాబాద్ జిల్లా) లోని ప్రధాన క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.35 ఏళ్ల ఇమ్రాన్ సికిందర్ పటేల్ అనే యువ ఆల్‌రౌండర్ ఓ లీగ్ మ్యాచ్‌లో ఓపెన్‌గా బరిలో దిగాడు.కొన్నిఓవర్లు బ్యాటింగ్ చేశాక తనకు ఛాతీలో నొప్పి ఉందని అంపైర్ చెప్పి అనుమతితో పెవిలియన్ కి వెళ్లబోయాడు.అలా గ్రౌండ్ చివరికి వెళ్లే సరికి పెవిలియన్ లోకి వెళ్లక ముందే కుప్పకూలిపోయాడు. గ్రౌండ్ సిబ్బంది హుటాహుటిన అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇమ్రాన్ చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.కాగా మంచి శరీర సౌష్టవంతో పాటు ,నిత్యం వ్యాయామం చేస్తాడని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని ఇమ్రాన్ సహచరులు వెల్లడించారు.అతని మృతి తమకెంతో దిగ్బ్రాంతిని కలిగించిందన్నారు. మృతునికి భార్య,ముగ్గురు పిల్లలున్నారు.మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇమ్రాన్ మృతికి విచారం వ్యక్తం చేసింది.