చిన్నోడే కానీ చిచ్చర పిడుగు..టీమిండియాకు మరో సచిన్ దొరికేశాడు
కేవలం 14 ఏళ్ల పసి వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తున్నాడు. భారత క్రికెట్ అభిమానులకు అప్పటి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటను గుర్తు చేశాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. మైదానంలో ఫోర్లు, సిక్స్‌లతో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్‌ని రాజస్థాన్ రాయల్స్ వైభవ్ దూకుడు కారణంగా 15.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇంత భారీ స్కోర్‌ను తక్కువ ఓవర్లలో ఛేజ్ చేసిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో టీ 20లో అర్థశతకం, శతకం చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు వైభవ్. అంతేకాదు ఐపీఎల్ మెగాటోర్నీలో క్రిస్ గేల్ తర్వాత రెండవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. గేల్ 30 బంతుల్లో సెంచరీ కొడితే, వైభవ్ 35 బంతుల్లో కొట్టేశాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలనేది తన కల అని, అది ఇంత త్వరగా సాకారమైనందుకు చాలా హ్యాపీగా ఉందని వైభవ్ పేర్కొన్నాడు. జైస్వాల్‌తో కలిసి ఆడడం చాలా బాగుందన్నాడు.

