ఉక్రెయిన్‌పై రష్యా తాజా డ్రోన్ దాడులకు కారణం తెలిస్తే షాకవుతారు!
రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. రష్యా యుద్ధం చేయలేక చేతులెత్తేస్తోందని అందరూ భావించారు. ఉక్రెయిన్‌కు ప్రపంచదేశాలు బాసటగా నిలవడంతో రష్యాకు ఇబ్బందులు తప్పవనుకున్నారు. అయితే రష్యా కీలక రంగాల్లో స్వావలంబన సాధించడంతో, ప్రపంచదేశాల మద్దతు లేకుండానే ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా, ఇంగ్లాండ్ చెప్పినట్టుగా ఉక్రెయిన్ నడుచుకుంటోందని నాటాలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్ ఆక్రమణ ప్రాంతానికి స్వాతంత్ర్యం ఇస్తున్నామన్నట్టుగా చెప్తున్న రష్యా, ఉక్రెయిన్ తమ చెప్పు చేతల్లో ప్రభుత్వం ఉండాలని భావిస్తోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దూకుడు మంత్రంగా ముందుకు సాగడంతో రష్యా కొంత వరకు యుద్ధం విషయంలో వెనుకంజ వేసింది. ప్రపంచదేశాల మద్దతుతో ఉక్రెయిన్ చెలరేగిపోతుందన్న విమర్శ కూడా ఉంది. అయితే తాజాగా రష్యాపై ఉక్రెయిన్ దాడికి అసలు కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాత్రంతా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లు లక్ష్యంగా చేసుకుని రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడి ప్రారంభించింది. ఉక్రెయిన్ కీలక నగరాల్లో రష్యా దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ వైమానిక దళం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను గుర్తించిందని, ఖార్కివ్, డ్నిప్రో ఫ్రంట్‌లైన్ తూర్పు ప్రాంతాల నుండి దక్షిణ ఓడరేవు నగరం ఒడెసా, అలాగే రాజధాని కైవ్ వరకు దాడులు కొనసాగాయి. ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, డొనెత్స్క్‌లోని ఫ్రంట్‌లైన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రష్యా క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం 18 మంది మరణించగా, 37 మంది గాయపడ్డారు. 100కి పైగా క్షిపణులు, 100 డ్రోన్‌లను ఉపయోగించి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఇది అతిపెద్ద దాడుల్లో ఒకటి, వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, ‘షాహెద్’ లతో తమపై దాడి చేశారని వీడియో సందేశంలో అభిప్రాయపడ్డారు. “రష్యన్ ఉగ్రవాదులు, ఉక్రెయిన్ ప్రజలు కరెంట్ కోతలతో సతమతమవ్వాలని, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారు” అని ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ సోమవారం టెలిగ్రామ్‌లో రాశారు. డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్‌సోనిక్ కింజాల్ క్షిపణుల ద్వారా 15 ఏరియాల్లో దాడులు చేశారన్నారు.

అసలు దాడికి కారణమేంటంటే.. రష్యాపై యుద్ధంలో తమకు ప్రపంచదేశాల మద్దతు లభిస్తోందన్న దీమాతో ఉన్న ఉక్రెయిన్, రష్యాను ఇరుకునపెట్టేలా ఆ దేశ భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. గతంలో ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఎలా ఆక్రమించుకుందో, అదే విధంగా తాము కూడా చేయాలని ఉక్రెయిన్ భావిస్తోంది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. రష్యా సరిహద్దు ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురు పౌరులు మరణించారని రష్యా అధికారులు తెలిపారు. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాలు 3కిమీ వరకు ముందుకు దూసుకుపోయాయని, అక్కడ ఉన్న రెండు స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పిన కొద్దిసేపటికే రష్యా దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ సైనికులు ముందుకు సాగిన కుర్స్క్ ప్రాంతానికి క్షిపణులు, ఫిరంగులను పంపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై మొట్టమొదటి విదేశీ దండయాత్ర ఇదని, అందుకే ఉక్రెయిన్‌ను చావుదెబ్బతీస్తామంటోంది రష్యా. తమ దేశంలో భూభాగాలు ఆక్రమించుకోవాలనుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరిస్తోంది. కుర్స్క్ సరిహద్దు ప్రాంతంలోకి కైవ్ షాక్ చొరబాట్లకు ప్రతిస్పందనగా, రష్యా దాడికి పూనుకుంది. శనివారం ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, కైవ్‌లోని అమెరికా ఎంబసీ రష్యా డ్రోన్, క్షిపణి దాడుల ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. రెండున్నరేళ్ల యుద్ధంలో, రష్యా పదేపదే ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్ పౌరులను అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తోంది. గడ్డకట్టే శీతాకాలపు ఉష్ణోగ్రతలను యుద్ధ ఆయుధంగా మలుచుకుంటోంది. సోమవారం దాడి తర్వాత, ఉక్రెయిన్ ఇంధన మంత్రి హెర్మన్ హలుష్చెంకో మాట్లాడుతూ, తమ దేశ ఇంధన రంగంపై దాడులు చేసి తమను దెబ్బకొట్టాలని రష్యా అనుకుంటోందన్నారు.

