మీకు ప్రత్యేకహోదాకు అర్హత లేదన్న కేంద్రం
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు అర్హత లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడానికి ఎన్డీయే పార్టీల మద్దతు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. వాటిలో ఏపీలో టీడీపీ పార్టీ, బీహార్ నుండి జేడీయూ కీలకంగా ఉన్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ప్రత్యేక రాష్ట్ర హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేడీయూ ఎంపీ మండల్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు హోదా పొందడానికి బీహార్ రాష్ట్రానికి రాజ్యాంగం నిర్వచించిన ఐదు అర్హతలు లేవని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం స్పెషల్ స్టేటస్ కుదరదని తేల్చి చెప్పారు.

స్పెషల్ స్టేటస్ పొందడానికి గల అర్హతలు:
పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం కలిగిన రాష్ట్రమై ఉండాలి.
తక్కువ జనాభా, జనసాంద్రత కలిగి ఉండడం, వారిలో గిరిజన జనాభా అధికంగా ఉండడం.
ఆర్థికంగా, పారిశ్రామికంగా బాగా వెనుకబడి ఉండడం.
పక్క దేశాలతో సరిహద్దులు కలిగి ఉండడం.
రాష్ట్రంలో సహజ వనరులు ఏమీ లేకుండా, నదులు, మైదాన ప్రాంతాలు, పంటభూములు లేకుండా ఉండడం. ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉండడం.
ఈ సమస్యలు బీహార్‌లో లేనందువల్ల ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం తేల్చింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా పొందే అవకాశం లేదు. కానీ కేంద్రప్రభుత్వం ఒప్పందం ప్రకారం రాష్ట్రాలకు పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధులకు, ప్రాజెక్టులకు, రోడ్లకు భారీ ఎత్తున నిధులు సమకూర్చవచ్చు.

