శాసనమండలిలో భారీగా పెరగనున్న వైసీపీ బలం
ఇప్పటి వరకు శాసనమండలిలో టీడీపీ ఆధిపత్యం చూపించగా… ఇకపై ఆ స్థానంలో వైసీపీ సత్తా చాటనుంది. మండలిలో వైసీపీ బలం పెరిగింది. ఏపీ శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం అధికార వైసీపీ సభ్యుల బలం 33 నుంచి (గవర్నర్ కోటాతో కలిపి) 44కి పెరిగింది. టీడీపీ సభ్యుల బలం 17 నుంచి 10కి తగ్గింది. పీడీఎఫ్‌కు శాసనమండలిలో ఐదుగురు సభ్యుల బలం ఉండగా ఇకపై అది మూడుకు తగ్గింది. బీజేపీ సభ్యుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడటంతో మండలిలో ఆ పార్టీ ప్రతినిధ్యం కోల్పోయింది. శాసనమండలిలో ఖాళీ అయిన 21 స్థానాల్లో వైసీపీ 17, టీడీపీ 4 గెలుచుకున్నాయి. ఈ నెలఖారుతో ఏడుగురు వైసీపీ సభ్యుల పదవీకాలం ముగయనుంది. టీడీపీ 11 మంది సభ్యుల పదవీ కాలం కొందరికి ఈ నెలలో, మరికొందరికి వచ్చే నెలాఖరున ముగియనుంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఒకరు, గ్రాడ్యుయేట్ కోటా నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులు శాసనమండలికి ఎన్నికయ్యారు.