Andhra PradeshNews

జగనన్నా… వాలంటీర్లు సరే… మరి మా సంగతేంటి?

◆ పార్టీ క్యాడర్ ను పట్టించుకోని వైసీపీ అధినేత
◆ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయటంతో పార్టీ కేడర్‎కు తొలి దెబ్బ
◆ కేడర్ ఎదురు తిరిగితే రాబోవు ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్థితి
◆ తగిన పరిహారం తప్పదంటున్న విశ్లేషకులు

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రతి ఒక్కరు సమాయత్తంగా ఉండాలని ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి నాయకులకు కొన్ని రోజులుగా సూచిస్తూ వస్తున్నాయి. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే వెన్నుముకలాగా పనిచేస్తూ ఉంటారు. గతంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా తమ పార్టీ క్యాడర్ను పట్టించుకోని సందర్భాల్లో ఓటమిని చవిచూస్తూ వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం వైసీపీలో పార్టీ క్యాడర్ స్తబ్దుగా ఉంది. పార్టీ అధిష్టానం ఆ పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలు నాయకులు ఎవ్వరు తమను పట్టించుకోవడంలేదని వారు వాపోతున్నారు. ఒక్క చాన్స్ కనుక ఇస్తే ఇక ముప్పైయేళ్ళ పాటు నేనే సీఎం అని జగన్ తన పాదయాత్ర సందర్భంగా తరచూ ప్రతీ చోటా చెప్పారు. నాడు జగన్ కి వచ్చిన ఊపు కూడా అలాగే ఉండేది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న తరువాత ఏపీలో విపక్షాల గుండెలు జారిపోయాయి. వైసీపీ వ్యతిరేకవర్గం సైతం జగన్ కనీసంగా రెండు సార్లు సీఎం కచ్చితంగా అవుతారు. ఏపీలో విపక్షం ఏమైనా చూసుకోవాలంటే 2029 ఎన్నికల తరువాతనే అంటూ ఉండేవారు. అప్పుడు వైసీపీ ప్రభంజనం ఆ రేంజ్‌లో ఉండేది. దాంతో అందరూ కూడా జగన్ అంతటి రాజకీయ బలవంతుడు అనే భావించేవారు. వైసీపీ కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. జగన్ జపమే పార్టీలో అంతటా వినిపించేది.

అయితే పాలనా పగ్గాలు అందుకున్న తరువాత జగన్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారు. తనదైన శైలిలో పాలన చేస్తూ వచ్చారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో క్యాడర్‌కి తొలి దెబ్బ తగిలింది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ క్యాడర్‌కి అత్యంత ప్రాధాన్యత ఉంటూ వచ్చేది. వారే జనాల వద్దకు వెళ్ళి తాము ఫలానా పని చేయించామని చెప్పుకునేవారు. ప్రజలు కూడా వారిని ఆశ్రయించేవారు. కానీ వైసీపీ కొత్త విధానాల వల్ల కేడర్ ఆశలు అన్నీ కొట్టుకుపోయాయి. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా వారికి తీరని అన్యాయం జరిగింది. కొందరికి తప్ప అందరికీ న్యాయం జరగలేదు. పార్టీని పదేళ్ల పాటు తమ భుజాల మీద మోసి అన్నీ అరగదీసుకున్న కేడర్ వైసీపీకి దూరం అవుతూ వచ్చింది. ఇక తమ నియోజకవర్గాలలో కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులను చేరదీసి వారికి కాంట్రాక్ట్ పనులు ఇప్పించారు. తమ ప్రభుత్వమే కదా అని ఉత్సాహపడి కాంట్రాక్టు పనులు చేసిన వారికి అప్పుల తిప్పలు ఇపుడు మిగిలాయ తప్పించి డబ్బులు మాత్రం బిల్లుల రూపంలో రావడం లేదంటున్నారు. చాలా మంది పార్టీ క్యాడర్ ఇలా కాంట్రాక్టులు తీసుకుని పూర్తిగా ఖర్చు అయిపోయారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తీరా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పేరుకుపోయి ఏమీ కట్టలేక మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. దాంతో పార్టీ కేడర్ ఈ దెబ్బకు ఇంకా దూరం అయిపోయింది.

ఏకంగా సభలూ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కొందరు ఇదే విషయం వైసీపీ పెద్ద నాయకుల దృష్టిలో పడేలా చెబుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో బాగా అన్యాయం అయిపోతున్నారు పార్టీ క్యాడర్. ఇపుడు చూస్తే ముచ్చటగా మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ నాలుగో ఏట అడుగుపెట్టింది. అయితే ఈ మూడేళ్ళలో కేడర్ చేదుని మింగుతూ పడుతూ లేస్తూ అలా సాగుతోంది. ఎప్పటికైనా తమకు ముక్తీ, మోక్షం ఉంటాయన్న ఆశతోనే సాగుతోంది. కానీ వారు ఊహించినది ఏమీ జరగడంలేదు. కనీసం వారికి వైసీపీ పెద్దలు ఎమ్మెల్యేలు కీలక నేతల నుంచి కూడా దగ్గరకు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కేడర్ స్తబ్దుగా మారిపోయింది. వారిలో వచ్చిన ఈ మార్పు వైసీపీకి రేపటి రాజకీయంలో కఠినమైన తీర్పుగా మారుతుందంటున్నారు. కేడర్ ఇపుడు చాలా వ్యతిరేకంగా ఉందటున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి యాభై మంది కీలకమైన నాయకులు, కేడర్‌తో మాట్లాడతామని ఆ మధ్య అన్నా ఒకటి రెండు నియోజకవర్గాలతో ఆ కథ ఆగిపోయింది. దాంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి. ఎలా తమ బాధను చెప్పుకోవాలో అర్థం కాక కేడర్ సతమతమవుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు కేడర్‌తో పనేంటి అనుకుంటున్నారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. టీడీపీ కూడా గతంలో తమకు తిరుగులేదని భావించి కేడర్‌ని పట్టించుకోలేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడింది. మరి టీడీపీ నుంచి గుణపాఠాలను వైసీపీ ఎంతమేరకు నేర్చుకుంది అన్నదే చర్చ. కేడర్‌ని తక్కువ చేసినా చూసినా తగిన పరిహారం తప్పదన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.