వివేక హత్యపై వైసీపీ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేక హత్య మిస్టరీపై సీబీఐ విచారణ ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ విమర్శలు అర్థరహితమని చెప్పిన కొడాలి… వివేకాను చంపడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చేదేముందన్నారు. అసలు వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉండి, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని చూశారని.. ఆయన ఆస్తులన్నీ భార్య, కూతురు, అల్లుడు పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిపోయాయని.. వీటి గురించి ఎవరూ మాట్లాడరన్నారు. వివేక బతుకున్నా.. కడప ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్‌కే ఇచ్చేవారన్నారు. అసలు వివేకానంద రెడ్డిని చంపడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆస్తి ఎంత? ఐదు పైసల బిళ్లుందా? ఆయనకు ఏమైనా పదవి వచ్చిందా? పనీపాట లేక బాబాయిని చంపుతాడా? అంటూ కొడాలి దుయ్యబట్టారు.

ఇక చంద్రబాబు మామను చంపి ముఖ్యమంత్రి అయ్యారంటూ కొడాలి ఆరోపించారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షపదవిని… దేనికి పనికిరాని పప్పును నాయకుడ్ని చేసేందుకు ఊరి మీదకు వదిలారంటూ దుయ్యబట్టారు. ఎన్టీఆర్ తర్వాత.. 40 ఏళ్లు హ్యాపీగా బతికారని దెప్పిపొడిచారు. ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతు కోశారని… వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. ఐతే వివేకానంద రెడ్డిని చంపితే వైఎస్ జగన్‌కు ఏమొస్తుందని ప్రశ్నించారు కొడాలి. దినం ఖర్చులు, భోజనాలు, టిఫిన్లు ఖర్చు తప్పించి… ఏమొస్తుందన్నారు. వివేకానందను చంపితే… జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది? ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? వైసీపీ ఏమైనా… వివేకానంద రెడ్డి పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే.. వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మపై పోటీ చేశారన్నా విషయాన్ని మర్చిపోకూడదన్నారు.

వివేకా వైసీపీ ఫౌండర్ కాదని.. ఆయన ఆదర్శాలతో పార్టీ రాలేదన్నారు. వివేకానందరెడ్డి, జగన్ చేయి పట్టుకొని నడిపిస్తే సీఎం కాలేదన్నారు. అసలు వివేకానందరెడ్డిని చంపితే, చనిపోతే జగన్మోహన్ రెడ్డికిగానీ, జగన్ కుటుంబ సభ్యులకు గానీ ఏమొస్తుందన్నారు. వివేకా, బతికున్నా.. చనిపోయినా… ఆ సీటు అవినాష్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవారన్నారు కొడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి.. పార్టీ పెట్టి కడప పార్లమెంట్‌కు, విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తే.. వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి ఎదురు పార్టీ నుంచి పోటీ చేసి ఓడించాలని… సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులన్నారు కొడాలి. అవినాష్ రెడ్డి గానీ, భాస్కర్ రెడ్డి గానీ… జగన్మోహన్ రెడ్డి.. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనతోనే ఉన్నారన్నారు. వైసీపీ, జగన్ విజయం కోసం ప్రతి నిమిషం… పాడుపటిన వ్యక్తులు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అన్నారు.

వివేకానంద రెడ్డి బతుకున్నప్పటికీ అవినాష్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ సీటిచ్చేవాడన్నారు కొడాలి. అసలు సీటు ఎవరికి ఇవ్వాలన్నజగన్ ఇష్టమన్నారు. వివేకానంద రెడ్డి చనిపోయే ముందు ఆయన పేరుతో ఐదు పైసల ఆస్తి కూడా లేదన్న కొడాలి… ఆయన పేర ఉన్న ఆస్తి అంతా భార్య, కూతురు, అల్లుడి పేరుతో ట్రాన్స్‌ఫర్ అయ్యాయన్నారు. ఎందుకు వివేక ఆస్తులు కుటుంబ సభ్యుల పేరుతో ట్రాన్స్‌ఫర్ అయ్యాయో చెప్పాలన్నారు కొడాలి. వివేక చనిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆస్తి రాలేదన్నారు. రాజకీయపదవులు రాలేదన్నారు. సీబీఐ యంక్వైరీ కావాలని నాడు అడిగిన వైసీపీ.. నేడు ఎందుకు అడగడం లేదన్న ప్రశ్నకు కొడాలి ఘాటు రిప్లై ఇచ్చారు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నందునే సీబీఐ అడిగామని… జగన్ సర్కారు వచ్చాక ఇక ఆ అవసరం లేకుండా పోయిందన్నారు. సీబీఐ ఏపీలోకి రావడానికే నాడు చంద్రబాబు వీళ్లేదన్నారనే.. తాము విచారణ కోరామన్నారు. సీబీఐ రావడానికి లేదని చెప్పి వివేక హత్యను జగన్మోహన్ రెడ్డిపైకి నెట్టాలని చూశారేమోనన్న అనుమానం తమకు ఉందన్నారు.
