సొంత పీఏపై చెయ్యి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మత్స్యకార గ్రామం పూడిమడకలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మంత్రి అమర్‌నాథ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఏపీఐఐసీ పైపులైన్ ప్యాకేజీ ఇప్పించడంతో పాటు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హమీని కూడా నెరవేర్చలేదని మండిపడుతూ.. గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆయన వారిపైకి వేగంగా దూసుకెళ్లే ప్రయత్నం చేయగా..ఎమ్మెల్యే పీఏ నవీన్ శర్మ కన్నబాబురాజును అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే తన పీఏ చెంప పగులగొట్టారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ సొంత పార్టీ నేతల వ్యతిరేకత మధ్యే కార్యాక్రమం యధావిథిగా కొనసాగింది.