అధికార పార్టీ నాయకుల్లో అంతర్మథనం
◆ పింఛన్ల తొలగింపుతో గడపగడపకు వెళ్ళలేని పరిస్థితి
◆ పలు నియోజకవర్గాల్లో ప్రజల నిలదీత
◆ రకరకాల నిబంధనలు పేరుతో పింఛన్లకు కత్తెర
ఏపీలో మూడున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరించాలంటూ సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మూడేళ్ల పాలనలో ఏ కుటుంబానికి ఎంత లబ్ది జరిగిందో కరపత్రాల ముద్రించి ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్దిని ప్రతి కుటుంబానికి వివరించాలంటూ సీఎం జగన్ నేతలను గట్టిగా ఆదేశించారు. నవరత్నాలు తప్ప అభివృద్ధి లేదని ఇప్పటికే కొన్నిచోట్ల జనం వైసీపీ నాయకులను నిలదీస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు పింఛన్లకు కోత పెట్టటం పింఛన్ల వడపోతలో నిబంధన తెరపైకి తీసుకురావడం రకరకాల నిబంధనలను చూపించి పింఛన్లకు కత్తెర పెట్టే కార్యక్రమం జరగడంతో అధికార వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.

పెన్షన్ పెంచుతూ సర్కారు తీసుకున్న నిర్ణయం నేతలు స్వాగతిస్తున్నప్పటికీ పెన్షన్ కోతలు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే వివిధ నిబంధనల పేరుతో ఏపీలో చాలామందికి అనర్హత నోటీసులు జారీ చేయడంతో గడప గడప కార్యక్రమంలో వైసీపీ నేతలకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. పండు ముసలి వారికి పెన్షన్లకు కత్తెర పడటంతో వివిధ కారణాల చూపుతూ ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేయటం తో గడపగడపకు తిరగాలంటే వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే అభివృద్ధి జరగకపోవడం కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం చెత్త పన్ను వేయటం ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ పై పన్నులు తగ్గించిన ఏపీలో తగ్గించకపోవడం ఇతరత్రా కారణాలవల్ల అధికార వైసీపీ పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నవరత్నాలు అందించామని థీమాగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ నాయకులకు పింఛన్ల తొలగింపు యత్నం జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో ఆరోగ్యానికి సంబంధించిన మందులు ఇతరత్రా వాటికోసం ఆ డబ్బును వృద్ధులు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు వారంతా నోటీసులు అందుకోవటంతో ప్రభుత్వం పై మండిపడుతున్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటే పాతవారిని తీసేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు వారి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు నిబంధనలను ప్రభుత్వం పెంచుతుందని రకరకాల నిబంధనలు తెరపైకి తెచ్చి పింఛన్లను తొలగించటం ఎంతవరకు భావ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఏపీవ్యాప్తంగా చాలాచోట్ల నిరసన వ్యక్తమవుతా ఉన్నాయి మరి దీనిపై వైసీపీ అధిష్టానం పునరాలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.