వైసీపీకి ‘జనసేన’ అంటే భయం -పవన్‌కళ్యాణ్
మంగళగిరి సభలో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు జనసేన అంటే భయమన్నారు పవన్‌కళ్యాణ్. వైసీపీ నేతలు ఎప్పుడు జనసేన పార్టీకే ఎక్కువగా భయపడుతున్నారని వ్యాఖ్యలు చేసారు పవన్. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీని తిట్టడం మరిచి పోయినా, జనసేనను తిట్టడం మరిచిపోరన్నారు. జనసేన నేతలతో మాట్లాడుతూ, వ్యూహంతో ముందుకు వెళ్లాలని, ఒక్కొక్కరూ 100 మందితో అయినా ఓట్లు వేయించే కెపాసిటీతో ఉండాలని పేర్కొన్నారు. తమ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోతే సీఎం పదవి ఎలా వస్తుందన్నారు. తాను జనసేన పార్టీ పెట్టేనాటికి టైం లేదని, అందుకే పెద్దపార్టీలైన తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని, అదేం తప్పు కాదని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ కూడా అంచెలంచెలుగానే ఎదిగి జాతీయపార్టీగా మారిందన్నారు. అలాగే జనసేన కూడా అంచెలంచెలుగా పెరిగి అధికారం చేపడుతుందని ఆశిస్తున్నారు. కాపులను వైసీపీ నాయకులు చీ కొట్టినా కూడా వాళ్లకే ఎందుకు ఓటు వేసారని కాపులను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కులరహిత సమాజం కావాలని పేర్కొన్నారు. తనకు ఏపార్టీతోనూ ద్వేషం లేదని, తనకు వ్యూహం మాత్రమే ఉందన్నారు. తాను ఈసారి ఓడిపోవడానికి సిద్దంగా లేనని, తప్పకుండా పొత్తు పెట్టుకుంటానని తెలియజేశారు.

