ఏపీ ఆర్థిక వ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లా, దేవగుడిపల్లి: వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర పథకాలలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.
బుధవారం అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో పర్యటించిన చంద్రబాబు, రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల గృహప్రవేశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల వివరాలను నమోదు చేస్తున్నామని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే ఇంటిపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తామని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోలార్ విద్యుత్తుతో కరెంటు ఉత్పత్తి జరుగుతోందని వివరించారు.
రాయలసీమలో 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, నదుల అనుసంధానం తన జీవితాశయమని, దీని ద్వారా ప్రతి ఎకరా భూమికీ నీరు అందే రోజు దూరం లేదని అన్నారు. తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

