Andhra PradeshHome Page Slider

ముందస్తు ఎన్నికలకు జగన్ ?

  • గడపగడపలో ఎన్నికల ప్రచారం
  • ముందస్తు ఎన్నికలకు వైసీపీ సన్నద్ధం
  • ఏర్పాట్లలో వైయస్సార్సీపీ అధినేత జగన్
  • జగనన్నే మా భవిష్యత్ వెనుక వ్యూహం అదే
  • ప్రతి ఇంటి తలుపు తడుతున్న గృహ సారధులు

ఏపీలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైఎస్ఆర్సిపీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందస్తు ఎన్నికలకు తప్పనిసరిగా వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో జగన్ స్పష్టం చేశారు. కానీ మరోవైపు ముందస్తు ఎన్నికల్లో భాగంగానే ఇటీవల కాలంలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. మరి కొద్ది రోజుల్లో మరొక మారు అధికారులు బదిలీలు ఉంటాయని అంటున్నారు. దీంతో తన ఎన్నికలలో జగన్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది.

దీంతోపాటు భారీ ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ తెరతీసింది. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపును వారి పార్టీ గృహ సారధులు తడుతున్నారు. ఈనెల 7వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 20వ తేదీ వరకు జరగనుంది. రాష్ట్రంలో ఉన్న 1.4 కోట్ల గృహాల వద్దకు వెళ్లి నేరుగా ప్రజలను ఆ పార్టీ నేతలు కలుస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఇంటి తలుపుల మీద వాహనాల మీద జగనన్నే మా భవిష్యత్తు అనే స్టిక్కర్లు అంటిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉన్న తేడాలను స్పష్టంగా వివరిస్తున్నారు. ఇదంతా పార్టీ ప్రచారంలా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ముందస్తు ఎన్నికల ప్రచారంలోనూ భాగం అనేది విశ్లేషకులు మాట.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే సంక్షేమ పథకాలకు కొత్తగా అప్పులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో రానున్న ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులకు సహకరిస్తుందో లేదో అని అనుమానం జగన్ లో ఉంది. ఈ కారణంగా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తారని ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది. దీంతో పాటు సెప్టెంబర్ నుండి సీఎం జగన్ పల్లె నిద్రకు బయలుదేరి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో సెప్టెంబర్ నుంచి సీఎం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఉంటుందని ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించినట్లు అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కొనసాగుతున్న గడపగడపకు కార్యక్రమాన్ని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మరింత ఫోకస్ తో అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజలతో మరింత మమేకమవ్వాలని కొద్ది రోజుల క్రితం జరిగిన మీటింగ్‌లో సీఎం జగన్ సూచించారు. జిల్లాలలో ఎటువంటి సమస్య వచ్చిన ప్రతిపక్షాలకు అస్సలు అవకాశము ఇవ్వ వద్దని వెనువెంటనే ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలను వెల్లడించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలా సాగుతుంది. దీంతో పాటు ఈ నెల 13వ తేదీ నుండి జగనన్నకు చెబుదాం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న ఫోన్ నెంబర్‌కు సమస్యను రికార్డు చేసి పంపిస్తే… ఆ సమస్యను సీఎం పరిష్కారిస్తారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ముందస్తు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతుందని అనుకోవాల్సి ఉంది.