Breaking Newshome page sliderHome Page SliderNationalNewsPoliticsviral

మాజీ ప్రధాని థాంక్స్ చెప్పారని బాంబుపేల్చిన యాసిన్ మాలిక్

లష్కరే తొయిబా చీఫ్‌ను కలిసినందుకు మాజీ ప్రధాని థ్యాంక్స్ చెప్పారని యాసిన్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ వేర్పాటువాద నేత, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాలిక్, ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో 2006లో లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను కలిసిన విషయం బయటపెట్టారు. దీనిపై అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా తనకు కృతజ్ఞతలు తెలిపారని, కశ్మీర్‌లో అహింసా ఉద్యమానికి తండ్రిగా కొనియాడారని ఆయన తెలిపారు.
2005 కశ్మీర్ భూకంపం తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్ వీకే జోషి తనను కలసి, శాంతి చర్చల భాగంగా హఫీజ్ సయీద్ సహా ఇతర జిహాదీ నేతలతో భేటీ కావాలని అభ్యర్థించారని మాలిక్ చెప్పారు. ఉగ్రవాద గ్రూపులను పక్కన పెట్టి పాక్‌తో ఒప్పందం సాధ్యం కాదనే అభిప్రాయంతోనే ఈ సూచన చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో సయీద్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ నేతలను కలవడానికి తాను అంగీకరించానని మాలిక్ వెల్లడించారు.
జిహాదీ సమూహాలతో జరిగిన సమావేశంలో ‘హింసకన్నా సర్దుబాటు మేలని’ ఇస్లాం బోధనను ఉటంకిస్తూ, శాంతి దిశగా అడుగులు వేయాలని తాను కోరినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ సమావేశమే తరువాత తనపై ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు కారణమైందని, ఇది ‘క్లాసిక్ మోసం’ అని వ్యాఖ్యానించారు. అధికారిక ఆమోదంతో జరిగిన కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారని ఆరోపించారు.
తర్వాత ఢిల్లీకి తిరిగొచ్చినప్పుడు, ఐబీ బ్రీఫింగ్ అనంతరం నేరుగా ప్రధానిని కలిసే అవకాశం లభించిందని చెప్పారు. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో మన్మోహన్ సింగ్ తన కృషిని అభినందిస్తూ, కశ్మీర్‌లో అహింసా ఉద్యమానికి తండ్రిగా తనను భావిస్తున్నానని ప్రశంసించారని మాలిక్ వాదించారు.
ఇక, తన అఫిడవిట్‌లో మాజీ ప్రధాని వాజపేయి, సోనియా గాంధీ, పి. చిదంబరం, ఐకే గుజ్రాల్, రాజేష్ పైలట్ తదితర నాయకులను కలిసిన విషయాలు కూడా ప్రస్తావించారు. 1990 నుంచి వరుసగా ఆరు ప్రభుత్వాలు కశ్మీర్ అంశంపై తనతో సంప్రదింపులు జరిపాయని, దేశీయ, అంతర్జాతీయ వేదికలపై సమస్యపై మాట్లాడాలని ప్రోత్సహించాయని పేర్కొన్నారు. యాసిన్ మాలిక్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.