రోడ్లపైకి యమునా నది-ప్రమాదంలో దిల్లీ రహదారులు
ఎడతెరిపిలేని భారీ వర్షాలకు తోడు, ఎగువ నుండి వస్తున్న వరదనీరు కలవడంతో యమునానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరదనీరు దిల్లీ రోడ్లపైకి చేరి రహదారులన్నీ ప్రమాదకరంగా మారాయి. దిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసం ఉండే ప్రాంతం కూడా జలమయమయ్యింది. దిల్లీలోని రైల్వే పాత వంతెన వద్ద అత్యధిక స్థాయిని మించి మూడు మీటర్ల ఎత్తున 208.51 మీటర్లకు నీటిమట్టం చేరింది. హరియాణాలోని హత్నీకుండ్ నుండి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో నీటిమట్టం మరింత పెరిగేలా ఉందని, అలా జరిగితే మరింత ప్రమాదం జరగొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు.

కేజ్రీవాల్ ఇంటికి అర కిలోమీటర్ దూరంలోని కశ్మీరీ గేట్-మంజు కా తిలాని అనే ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దిల్లీ వ్యాప్తంగా వరద కారణంగా పాఠశాలలకు, విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఈ భారీ వర్షాల కారణంగా ఉత్తరాది అంతా అతలాకుతలం అయ్యింది. ఈ జల ప్రళయానికి హిమాచల్ ప్రదేశ్ చాలా నష్టానికి గురయ్యింది. అక్కడ అత్యధికంగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు నేలకూలాయి. యూపీలో కూడా 12 మంది, హరియాణా, పంజాబ్‌లలో 21 మంది మరణించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

