Home Page SliderTelangana

ఆదర్శమూర్తిగా జీవితం గడిపిన గుర్రం యాదగిరిరెడ్డి

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన గుర్రం యాదగిరిరెడ్డి రామన్నపేట ఎమ్మెల్యేగా 15 ఏళ్ల పాటు ప్రజల కోసమే పనిచేశారు. ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాలను గమనిస్తూ ఆదర్శ జీవితం గడిపారు. ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారు. 13వ యేటనే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆకర్షితుడై బాలసంఘంలో చేరారు. 75 ఏళ్ల పాటు కమ్యూనిస్టు పార్టీలో వివిధ పదవులు పోషించారు. అప్పటి రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరసగా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం తోడ్పాటుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ యాదగిరిరెడ్డికి హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదు. అతి సామాన్యుడిగా జీవితాన్ని వెళ్లదీసేవారు. కుమారుల ఇంట్లోనే ఉండేవారు. స్వగ్రామం సుద్దాలలో కేవలం ఆనాడు నిర్మించిన పెంకుటిల్లు మాత్రమే ఉంది. స్వగ్రామంలో వారి పెద్దలు సంపాదించిన మూడెకరాల భూమి మాత్రమే ఉంది. ఆయనకు కారు, ఇతర ఎలాంటి వాహనాలు, హంగు ఆర్భాటాలు ఉండేవి కావు. ఎటు వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులోనే ఆయన సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణం చేసేవారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం ఆ తదుపరి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడుపుతూ ఆదర్శంగా నిలిచారు. తొలి నుండి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతోనే రాజకీయాల్లో మనుగడ సాగించారు. తెలంగాణ సాయుధ పోరులో కీలకపాత్ర వహించిన యాదగిరిరెడ్డికి గెరిల్లా దళంలో పనిచేసినందుకు ఇచ్చే పింఛన్ కూడా ఇవ్వలేదు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గుర్రం యాదగిరిరెడ్డి 2019 నవంబర్ 22న గుండెపోటుతో మరణించారు.