ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్‌లో నిరసనలు
చైనా ఆపిల్ ఫోన్ల యూనిట్లో తిరుగుబావుటా…………………. నిఘా కెమెరాలను ధ్వంసం, పోలీసులతో ఘర్షణ
ఫాక్స్‌కాన్ తీరుపై కార్మికులు నిరసనలు……………………. ఆపిల్‌కు ప్రధాన సరఫరాదారు ఫాక్స్‌కాన్
పేమెంట్ విషయంలో చీటింగ్ చేస్తోందని విమర్శలు……………. ఉత్పత్తి ఆపేస్తామంటూ కార్మికుల వార్నింగ్
ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల ఆందోళనలు……………………. దిగొచ్చిన ఫాక్స్‌కాన్ కార్మికులకు క్షమాపణలు
జెంగ్‌జౌ నగరంలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్‌లో బుధవారం వందలాది మంది కార్మికులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఆపిల్ ప్రధాన సరఫరాదారు ఫాక్స్‌కాన్ గురువారం చైనాలోని కోవిడ్-హిట్ ఐఫోన్ ఫ్యాక్టరీలో కొత్త రిక్రూట్‌మెంట్‌లను నియమిస్తున్న సమయంలో సాంకేతిక లోపం సంభవించిందని పేర్కొంది. ఆందోళనతో కార్మికులకు క్షమాపణలు చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు నిఘా కెమెరాలను పగులగొట్టడంతోపాటు… పోలీసులతో ఘర్షణకు దిగారు. చైనాలో బహిరంగ అసమ్మతి కన్పించడం చాలా అరుదు. ఓవైపు వేతనాల చెల్లింపు మరోవైపు కోవిడ్ నిబంధనలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు బోనస్ చెల్లింపులను ఆలస్యం చేయాలని ఫాక్స్‌కాన్ భావిస్తున్నట్లు సమాచారం అందిందని సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలలో కార్మికులు మండిపడ్డారు. కొవిడ్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన సహోద్యోగులతో వసతి గృహాలను బలవంతంగా పంచుకోవలసి వస్తోందని కొందరు కార్మికులు ఫిర్యాదు చేశారు.

కార్మికుల ఆందోళనలపై తాము చర్యలు మొదలుపెట్టినట్టుగా ఫాక్స్‌కాన్ పేర్కొంది. ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపం సంభవించిందని… కొత్త కార్మికుల నియామకం గురించి మాత్రమే సమస్య వచ్చిందంది. కంప్యూటర్ సిస్టమ్‌లో ఇన్‌పుట్ ఎర్రర్‌కు క్షమాపణలు కోరుతున్నామని… అంగీకరించిన, అధికారిక రిక్రూట్‌మెంట్ హామీ మేరకు వేతనాల చెల్లింపు ఉంటుందని హామీ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించడానికి కంపెనీ ఉద్యోగులతో ప్రారంభ ఒప్పందాలు కుదుర్చుకున్నామని… ప్లాంట్‌లో ఉత్పత్తి గురువారం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంది. రాజీనామా చేసి ఫ్యాక్టరీ క్యాంపస్‌ను విడిచిపెట్టాలనుకునే కొత్త రిక్రూట్‌ల కోరికలను గౌరవిస్తామని, వారికి కేర్ సబ్సిడీలు అందించి పంపిస్తామని తైవాన్ కంపెనీ తెలిపింది. సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని విశాలమైన పారిశ్రామిక క్యాంపస్‌లో నిర్బంధంలో ఉన్నప్పుడు తమకు భోజనం లభిస్తుందో లేదో కచ్చితంగా తెలియదని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ ఎప్పుడూ మనుషులను మనుషులుగా భావించదంటూ ఒక కార్మికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కార్మికుల ఆందోళనలతో ఫాక్స్‌కాన్ షేర్లు గురువారం ఉదయం 0.5% పడిపోయాయి.

ఐఫోన్ 14 ప్రో, ప్రో మాక్స్‌తో సహా ఆపిల్ ఇంక్ పరికరాలను తయారు చేయడానికి జెంగ్‌జౌ ప్లాంట్ 2లక్షల కంటే ఎక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి చేస్తోంది. మొత్తం వ్యవహారంపై ఆపిల్ స్పందించింది. ప్రస్తుతం అనేక మంది ఆపిల్ సిబ్బంది కూడా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని… సమస్యను పరిష్కరించేందుకు తాము ఫాక్స్‌కాన్‌తో కలిసి పని చేస్తున్నామంది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ షిప్‌మెంట్‌లలో 70% వాటా జెంగ్‌జౌ ఫ్యాక్టరీదే. కార్మికుల అశాంతి కారణంగా నవంబర్‌లో జెంగ్‌జౌ ఫ్యాక్టరీలో ఐఫోన్ అవుట్‌పుట్ 30% వరకు క్షీణించవచ్చని రాయిటర్స్ ఇప్పటికే పేర్కొంది. ఈనెల 15 నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకున్నా అది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. ఇంతకుముందు ఊహించిన దాని కంటే ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల ఉత్పత్తి తక్కువ ఉంటుందని ఆపిల్ సైతం అభిప్రాయపడింది. తాజా ఆందోళనలతో ఆపిల్‌కు వారానికి $1 బిలియన్ డాలర్లు సుమారుగా 8 వేల కోట్ల రూపాయల మేర నష్టం వస్తోందని అంచనా…