Home Page SliderInternationalPolitics

‘మీ వ్యవహారంతో మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది’..ట్రంప్

‘లక్షలాది మంది జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. మీ వ్యవహారంతో మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది’.. అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మండి పడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వీరిద్దరి మధ్యా వైట్‌హౌస్‌లో జరిగిన వాగ్వాదం మీడియాలో వైరల్ అయ్యింది. మీడియా ఎదుటే అగ్రనేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం అమెరికా వచ్చారు. రష్యా తమపై చేస్తున్న దురాక్రమణలలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని, రక్షణ కల్పించాలని ట్రంప్‌ను కోరారు. మాటల మధ్యలో ఉక్రెయిన్ అతి పెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని ట్రంప్ హెచ్చరించారు. దీనితో జెలెన్‌స్కీ కూడా ‘మా దేశంలో మేం ఉంటున్నాం. దృఢసంకల్పంతో ఉన్నాం, ఎవరికీ తలవంచేది లేదని’ బదులిచ్చారు. దీనితో ట్రంప్ మండిపడ్డారు. వీరిద్దరి మధ్యా మాటల యుద్ధం తీవ్రమవడంతో దగ్గరలో ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వారిద్దరికీ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే సయోధ్య కుదరకపోవడంతో జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడ నుండి వెనుదిరిగారు. అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయన్ అధ్యక్షుడు సుముఖంగా లేరని అర్థమయ్యిందని పేర్కొన్నారు.