ప్రపంచ జనాభా దినోత్సవం- టాప్ 5 దేశాలు ఇవే
ప్రతీ సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. జనాభా విషయంలో టాప్ 5 స్థానాలలో అమెరికా తప్ప మిగిలిన నాలుగూ ఆసియా దేశాలే ఉన్నాయి. ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. పరిమిత వనరుల కారణంగా పెరుగుతున్న జనాభాకు తగినంత వనరులు సమకూర్చుకోలేక ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా పేదరికం, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు వంటి అంశాలలో దేశాలు వెనుకబడుతున్నాయి. భారత్ ఈ మధ్యనే చైనాను మించి జనాభా లెక్కలలో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ప్రతీ సంవత్సరం ఈ రోజున ఒక థీమ్‌ను ప్రకటిస్తారు యునైటెడ్ నేషన్స్. అలాగే ఈ సంవత్సరం ‘జెండర్ ఈక్వాలిటీ’ అంటే లింగ సమానత్వాన్ని ప్రతిపాదించింది. అంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని అవకాశాలను పొందడానికి కృషి చేయాలి.

143 కోట్ల జనాభాతో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా, 142.5 కోట్లతో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. 33.5 కోట్లతో అమెరికా మూడవ స్థానం, 28 కోట్లతో ఇండోనేషియా నాలుగవ స్థానంలో, 23 కోట్లతో పాకిస్థాన్ ఐదవ స్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానాలలో వరుసగా నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో నిలిచాయి. పై దేశాలలో చైనాను మినహాయిస్తే తర్వాతి స్థానాలలోని 8 దేశాల జనాభా కలిపినా భారతదేశ జనాభాను మించలేకపోవడం విశేషం. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్ మహిళలకు, బాలికలకు సమానత్వం కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇప్పటివరకూ ప్రపంచ జనాభా 8 బిలియన్లు చేరిందని ఫొటోను షేర్ చేసింది.

