Home Page SliderTelangana

బాధ పెడుతున్న మాటలు

నీ ముఖం చూసి ఒక్కరూ ఓటేయరు. ఎందుకు పోటీ చేశానా అని బాధపడతావు. మా పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థి మాటమీద నిలబడ్డ మనిషి.

గతంలో తిట్టిపోసిన పార్టీలోకి ఏ మొహం పెట్టుకుని చేరాలి అన్న తిప్పలు.. సోషల్ మీడియాలో వీడియోలుగా తిరిగొస్తున్న వ్యాఖ్యానాలు ఏమిటో ఈ పరిస్థితి, పగవాడికి కూడా రాకూడదు ఇటువంటి పరిస్థితి.

నీ ముఖం చూసి ఒక్కరూ ఓటు వేయరు. ఎందుకు పోటీ చేశానా అని దుఃఖిస్తావు. మా పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి నిక్కచ్చి మనిషి. విజయం తథ్యం అంటూ గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై ఒక పార్టీ కీలక నాయకుడు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నాటి ప్రత్యర్థి నేడు పార్టీ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో నాడు చేసిన విమర్శల వీడియోలు తన మెడకు చుట్టుకునేలా ప్రత్యర్థుల వైరల్ బావుటా ఎగురవేస్తున్నారు.

నువ్వో గుంటనక్కవు.. నీ పీడ విరగడైతేనే ప్రజలకు మంచిది.. అంటూ ఓ ప్రధాన పార్టీ నాయకుడిని మరో ప్రధాన పార్టీ నాయకుడు ఇన్నాళ్లూ దుమ్మెత్తి పోశారు. ఇటీవలే ఆ నాయకుడు తాను వ్యతిరేకించిన పార్టీలో చేరారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు ప్రస్తుతం తమ ప్రత్యర్థులకు ఆయుధంలా మారాయి. వాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు.

అరే.. ప్రస్తుత మన నాయకుడు.. గతంలో మన పార్టీని అంత మాట అన్నాడా? ఇప్పుడు ఆయన పక్కన మనోళ్లు ఎలా సర్దుకుపోతున్నారో? చూడాలి ఇవీ.. పార్టీ మారిన నేతల విషయంలో సామాన్య కార్యకర్తల స్పందన. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఎక్కడో ఒకచోట నిత్యం ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు రోత పుట్టిస్తున్నాయి. ఒకనాడు పార్టీలు మారడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కండువా కప్పుకోవడం ఒక్కటే కనిపించేది. పార్టీ వేదిక మారిన తరువాత గత విమర్శలను అంతా మర్చిపోయేవారు. కానీ నేడు అటువంటి పరిస్థితి లేదు, నిమిష నిమిషానికి ఒక పాత విషయాన్ని తవ్వుతూ ఆనాటి ప్రసంగాన్ని గుర్తుచేస్తున్నారు ప్రత్యర్థులు.. ఒకనాడు తీవ్ర విమర్శలు చేసిన వారితో కలిసిపోయినప్పటికీ పాత వ్యాఖ్యలు వెన్నాడుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నాయకులు సందర్భానుసారం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తిరిగి వినిపిస్తున్నాయి, హల్‌చల్ చేస్తున్నాయి.

వార్‌ రూంలకు చేతినుండా పని: పార్టీల ప్రచారానికి వెన్నుదన్నుగా ఉన్న సోషల్ మీడియా వార్ రూంలు కీలక నాయకులు గతంలో చేసిన ప్రసంగాలను తక్కువు నిడివి వీడియోలుగా రూపొందిస్తున్నాయి. వాటికి విరుపుతో కూడిన శీర్షిక, వ్యాఖ్యానాలు జోడించి వదులుతున్నాయి. ఇవన్నీ పార్టీలకు, ఆయా నేతలకు ఇబ్బందికరంగా మారాయి.

   అభ్యర్థుల పార్టీపైనా తికమక: గత ఎన్నికల్లో ఒక పార్టీలో ఉన్న అభ్యర్థి.. ఇప్పుడు మరో పార్టీలో అభ్యర్థిగా మారారు. నాటి ప్రచారంలో తమ పార్టీ గుర్తుకు ఓటేయాలంటూ చేసిన ప్రసంగాలు ఇప్పుడు వైరల్ అవుతుండడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. పాత వీడియోలు ఈ ఎన్నికల్లో కొంపముంచుతాయా అని అభ్యర్థులూ మదనపడుతున్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇలా పార్టీలు మారిన నాయకులు కొందరు.. గతంలో చేసిన వ్యాఖ్యలను తలుచుకుంటూ ఇప్పుడున్న పార్టీలో సర్దుకుపోతున్న పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు..