Home Page SliderTelangana

దొంగలతో కలబడి నెగ్గిన ఆడవాళ్లు…!

హైదరాబాద్: తుపాకీ గురిపెట్టి బెదిరించినా బెదరకుండా తల్లీకూతుళ్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు దోపిడీ దొంగలు వెనుదిరిగారు. బేగంపేట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రసూల్‌పుర జైన్ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. నవరతన్ జైన్, ఆయన భార్య అమిత మేహోత్ రసూల్‌పురలోని పైగా హౌసింగ్ కాలనీలో నివాసముంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్‌చంద్, సుశీల్‌కుమార్‌ కొరియర్ సర్వీసు వచ్చిందంటూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. అమిత వారిద్దరినీ తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్‌కుమార్ ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి బ్యాగ్‌లోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టారు. ఖరీదైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమిత.. సుశీల్‌ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈ లోపు ఆమె కుమార్తె రావడంతో గట్టిగా నెట్టేసింది. భయపడకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. పట్టుబడతామనే సమయంలో అతడు తుపాకీ  వదిలి పరారయ్యాడు. ఈ లోపు తల్లీకూతుళ్ల కేకలు విని ఇరుగు పొరుగు వారు చేరుకున్నారు. ప్రేమ్‌చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడినుండి పరిగెత్తే సమయంలో స్థానికులు వెంటబడి పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను వెంటనే అరెస్టు చేశారు.