భర్త చేసిన పనికి తలపై వేడినూనె పోసిన భార్య
భార్య దేన్నయినా సహిస్తుంది కానీ భర్తకు పరస్త్రీ వ్యామోహం ఉంటే తట్టుకోలేదు. కొన్నిసార్లు క్షణికావేశంలో ఏమి చేస్తుందో కూడా తెలియకుండా కూడా నేరాలు చేసేస్తూంటారు కొందరు. అలాంటి సంఘటనే జరిగింది హైదారాబాద్ జియాగూడలో. మాంసం వ్యాపారం చేసుకునే గిరిధర్‌లాల్ మూడేళ్లక్రితం జియాగూడ వచ్చి, కబేళాలో పనిచేస్తూ దరియాబాగ్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నాళ్లుగా పరాయిస్త్రీ వ్యామోహంలో పడి భార్యాపిల్లల పట్ల బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాడని భార్యాభర్తలిద్దరూ గొడవలు పడుతున్నారు. గత ఐదు నెలలుగా ఓ మహిళ వద్దే ఉంటూ 3 రోజుల క్రితమే ఇంటికి వచ్చిన భర్తతో భార్య గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రేణుక క్షణికావేశంలో అకస్మాత్తుగా వంటింట్లో కడాయిలో ఉన్న వేడి నూనెను భర్త తలపై పోసేసింది. దీనితో గిరిధర్ తల, ఛాతీ, చేతులు కాలి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు అతనిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స ఇప్పిస్తున్నారు. రేణుకను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.