ఆర్టీసీ బస్సులో కల్లుతో మహిళ హల్‌చల్..
తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఒక మహిళ కల్లు తీసుకెళుతుండగా ఆర్టీసీ సిబ్బంది అడ్డుకున్నారు. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి నల్లగొండ వెళ్తుండగా నకిరేకల్ వద్ద ఓ మహిళ రెండు సంచులతో బస్సు ఎక్కింది. ఆమె తీసుకువచ్చిన సంచుల్లో కల్లు బాటిల్ ఉండటంతో మహిళా కండక్టర్ అభ్యంతరం చెప్పింది. బస్సులో కల్లు లాంటి పానీయాలు తీసుకెళ్లకూడదని, అనుమతి లేదని చెప్పగా ఆమె వాగ్వాదం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సులో కొందరు కల్లు మద్యం కాదంటూ ఆమెకు సపోర్ట్ చేయగా, కొందరు వ్యతిరేకించారు. తాటి కల్లు తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉందని అందుకు అనుమతి ఇవ్వాలని వాదించారు. చివరికి డ్రైవర్ కూడా అభ్యంతరం చెప్పడంతో బస్సుకు అడ్డంగా నిలబడి ముందుకు కదలనివ్వకుండా కొద్దిసేపు ఆందోళన చేసింది. అనంతరం ఆ మహిళ ఆటోలో గమ్యస్థానానికి బయలుదేరింది.