Home Page SliderTelangana

ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు..

ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంతో రాష్ట్రానికి గతంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) పూర్తయితే మరోదఫా పెద్దయెత్తున పెట్టుబడులు తరలివచ్చి.. హైదరాబాద్ పెట్టుబడుల హబ్‌గా మారబోతుంది. అప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయి అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో, తర్వాత నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాది జవాబుదారీ (అకౌంటబులిటీ) ప్రభుత్వం. లెక్కల (అకౌంట్స్‌)తో మాకు పనిలేదు. లెక్కలే పరమావధిగా వ్యవహరించిన మునుపటి ప్రభుత్వానికి ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. మేం ఆర్‌ఆర్‌ఆర్‌ను రానున్న మూడున్నరేళ్లలో కొలిక్కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండు రింగు రోడ్ల మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నాం. గత ప్రభుత్వం ఈ రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మేం వచ్చాక రోడ్ల ఖర్చులకు సరిపడా రూ.340 కోట్లను చెల్లిస్తామంటూ కేంద్రానికి లేఖ రాయడంతో పనులు ముందుకు సాగుతున్నాయి.